16 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు….సంచలనం రేపిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

4
16 MLAs are in touch… .App Deputy CM Narayanaswamy

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మాతో చాలా మంది టీడీపీ ఎమ్మెల్మేలు టచ్‌లో ఉన్నారు. మీరు రండి అని జగన్ అంటే 16 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.’ అని నారాయణస్వామి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేసులకు భయపడి తన మనుషులను బీజేపీలోకి పంపుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు.

చంద్రబాబుకు కూడా బీజేపీలో చేరాలన్న తపన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రంతో దోస్తీ చేస్తే కేసుల నుంచి తప్పించుకోవచ్చని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కాళ్లు, చేతులు పట్టుకుని బీజేపీలో చేరాలనుకుంటున్నారని విమర్శించారు. అయితే, చంద్రబాబు లాంటి అవినీతిపరుడిని వద్దని బీజేపీ చెప్పిందని నారాయణస్వామి అన్నారు. ఏపీలో టీడీపీ జీరో అయిపోయిందని.. బీజేపీలో విలీనం చేయడమే మిగిలిందన్నారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

టీడీపీ నుంచి కేవలం 23 మంది మాత్రమే విజయం సాధించారు. జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలుపొందారు. అయితే, ఎన్నికల తర్వాత పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి గుడ్ బై కొట్టి బీజేపీ గూటికి చేరారు. తాజాగా వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి, ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు.