జాతీయ జనాభా రిజిస్టర్‌పై అమిత్ షా క్లారిటీ

6
amit shah

ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా మొదలైన ‘పౌరసత్వ’ నిరసనల సెగ క్రమేపి దేశవ్యాప్తంగా రేగుతున్న సమయంలో జాతీయ జనాభా(ఎన్‌పీఆర్) రిజిస్టర్‌ నవీకరణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించడం కలకలానికి దారితీస్తోంది. ఎన్‌పీఆర్ అప్‌డేట్ చేయడానికి సేకరించే వివరాలను జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) కోసం వినియోగిస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే అటువంటి ఆందోళన అనవసరమని కేంద్రం మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే అమిత్ షా కూడా మంగళవారం క్లారిటీ ఇచ్చేసారు. ఎన్‌పీఆర్‌కు ఎన్‌ఆర్‌సీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘ఈ రోజు నేనో విషయం స్పష్టంగా చెబుతున్నాను. ఎన్‌పీఆర్‌కు ఎన్‌ఆర్‌సీతో ఎటువంటి సంబంధం లేదు.’ అని అమిత్ షా విస్పష్ట ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై కూడా అపోహలు వ్యాప్తి చెందాయని ఆయన తెలిపారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన విధంగా ఎన్‌ఆర్‌సీపై ప్రస్తుతం ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన లేదని అమిత్ షా మరోసారి స్పష్టం చేసారు.