ఆనంవారి మాటల వెనుక అసలు  సంగతేంటో …………………….. 

3
Anam Ramanarayana Reddy Shocking Comments

ఏపీలో జగన్ సర్కారు పాలనపై టిడిపి విమర్శల జోరు కొనసాగిస్తుంటే, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత – మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా సొంత పార్టీలోని అందునా సొంత జిల్లాలోని మంత్రిని   టార్గెట్ చేస్తూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు పెద్ద టాపిక్ అయింది .  ‘‘స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలి. ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లాలి. అక్కడ కబ్జా రాయుళ్లు – లిక్కర్ మాఫియా – బెట్టింగ్ మాఫియా – ల్యాండ్ మాఫియా – ఇసుక మాఫియా.. ఇలా ఒక్కటేమిటి ఏ రకం మాఫియా కావాలన్నా ఉన్నాయి’’ అని  ఆనం  సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మాఫియాను అడ్డుకునే సమర్థుడైన పోలీసు అధికారి రావాలని, ప్రజలకు   విముక్తి కలిగించాలని కోరుతున్నట్లు  ఆనం చెప్పుకొచ్చారు.

నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉండగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా ఉన్నారు. వీళ్ళిద్దరిని  టార్గెట్ చేస్తూ ఆనం ఈ వ్యాఖ్యలు చేశారని టాక్. నెల్లూరు వైసీపీలో ముదరుతున్న విభేదాలకు ఇది సంకేతంగా చెబుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వేణుగోపాల స్వామి ఆలయం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు  రామనారాయణ రెడ్డి అసహనానికి కారణమంటున్నారు. వేంకటగిరి సంస్థానాధీశుల ఆనవాయతీ ప్రకారం అయిదు కుటుంబాలు ఈ దేవస్థానం ట్రస్టీలుగా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఆలయ ట్రస్టీల కమిటీని రద్దు చేసి, ప్రభుత్వం తరపున ఆలయ కమిటీని నియమించడం ద్వారా ఆనం కుటుంబ పెద్దరికం ఆలయం మీద ఉండకుండా పోయేలా అనిల్ కుమార్ మంత్రాంగం వుందని అనుమానం.

వేంకటగిరి రాజావారు నెలకొల్పిన నెల్లూరులోని వి.ఆర్. విద్యాసంస్థలపై ఆనం ఫ్యామిలీ పట్టుండేది. ఇప్పుడవి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలోకి మారాయి. దీనికి తోడు  అల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణ వ్యయం 250 కోట్లు కాగా.. రివర్స్ టెండరింగ్ విధానంలో 4 శాతం అధికంగా కోట్ అయ్యిందన్న సాకుతో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్  టెండర్ ను రద్దు చేయించారు. అధికార పార్టీలో వుండి కూడా ఈ టెండర్ కాపాడుకోలేకపోయానన్న అసంతృప్తి తో  ఆనం రగిలిపోతున్నారని అందుకే తనదైన శైలిలో విమర్శలకు దిగారని అంటున్నారు.