ఢిల్లీలో కమలనాధులు పాగా వేస్తారట

9
Bjp in delhi

ఈమధ్య కాలంలో మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఎదురుదెబ్బలు చవిచూసిన బిజెపి ఇప్పుడు కొత్తగా జరగబోయే కొన్ని రాష్ట్రాల ఎన్నికల విషయంలో తన వ్యూహాన్ని సరికొత్త పంధాలో అమలుచేయాలని చూస్తోందా .. ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పాగా వేస్తుందా .. అవుననే అంటున్నారు కమలనాధులు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన ‘బూత్ కార్యకర్త సమ్మేళన్’కు హాజరైన అమిత్‌ షా కార్యకర్తలను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలని షా విమర్శించారు. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఎంతోకాలం మభ్యపెట్టి, మోసగించలేరని, రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలో, ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుంద ని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కాగా పాక్‌లోని నాన్‌కనా సాహెబ్ గురుద్వారాపై దాడి విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. సిక్కులపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి నాన్‌కనా సాహెబ్ గురుద్వారాపై జరిగిన దాడే సమాధానమన్నారు. ఆ దాడిలో గాయపడిన సిక్కులు ఎక్కడకు వెళ్తారని అమిత్‌ షా ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశాన్ని కాంగ్రెస్, ఆప్ తప్పుదారి పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరకేంగా రాహుల్, ప్రియాంక హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీఏఏపై తమ పార్టీ ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తుందని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తుందని హామీ ఇచ్చారు