చంద్రబాబు పిచ్చిపని వల్లే ఈ దుస్థితి .. జెసి కామెంట్స్

9
jc diwakar reddy vs chandrababu naidu

మాజీ మంత్రి – టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఎప్పుడు పొగుడుతారో ,ఎప్పుడు వాతలు పెడతారో తెలీదు. మొన్నటికి మొన్న చంద్రబాబుని అనంతపురంలో తెగ పొగిడేస్తూ,పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబుపైనే ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఏపీ రాజధాని మార్పు అంశం పాలక విపక్షాలు రెండింట్లోనూ సొంత నేతలను తప్పు పట్టే నాయకులు కనిపిస్తున్నారు. తాజాగా జేసీ దివాకరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పిచ్చితనం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
‘తాత్కాలికం తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి అమరావతిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చెబితే, వైసీపీ ఇప్పుడు దాన్ని వేరేలా ఉపయోగించుకుంటోందన్నారు. చంద్రబాబు అప్పట్లో తాత్కాలికం అన్న మాట వాడకపోతే జగన్ ప్రభుత్వానికి ఇంత అడ్వాంటేజ్ దొరికేది కాదన్నారు. రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.

రాజధానిని కావాలంటే కడపలోనో పులివెందులలోనో పెట్టుకోవాలని ఆయన సీఎం జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రజలకు విశాఖ చాలా దూరమవుతుందని, చాలా ఇబ్బంది పడతారని అన్నారు. అమరావతికి సెక్రటేరియట్ లేకుండా చేసి రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం వల్ల ఒరిగేది ఏమీ లేదని జేసీ పెదవి విరిచారు. మహా అయితే ఓ 10 జిరాక్స్ షాపులు వస్తాయని, అంతకు మించి రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేసారు. రాజధానిని మార్చడం వైసీపీ నేతలు చెబుతున్నంత సులభం కాదన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని చెప్పారు.