నష్టం కలిగిస్తే సహించేదిలేదు – మమత ఫైర్

3
mamata banerjee

దేశవ్యాప్త ఎన్నార్సీ, పౌరసత్వ చట్టం, కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపిస్తున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. అందుకే కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ధర్నాలు, రాస్తారొకోలకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించాలని చూస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నార్సీ, పౌరసత్వ చట్టం, కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసనలకు మద్దతు నిస్తామన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేపట్టని కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, బెంగాల్లో మాత్రం అనిశ్చితి పెంచేందుకు ఇతర కారణాలను చూపుతూ ధర్నాలకు దిగుతున్నాయని విమర్శించారు.

రాజకీయంగా ఉనికి కోల్పోయిన పార్టీలే ఇక్కడ ‘పోరాట’ పంథా ఎన్నుకున్నాయని సీఎం మమత ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఉనికి నిలుపుకోవడానికే ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, జేఎన్‌యూలో దాడి ఘటనకు నిరసనగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్చి చేసి విద్యార్థులను చెదరగొట్టారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలోని మరోసారి జేఎన్‌యూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేఎన్‌యూ విద్యార్థులు మొన్నటి హింసాత్మక ఘటనపై హెఆర్‌డీ అధికారులను కలిసేందుకు విద్యార్థులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. వీరికి మద్దతుగా విపక్ష నేతలు, సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారత్‌, బృందా కారత్‌, శరద్‌ యాదవ్‌లు కూడా పాల్గొన్నారు. అయితే హెఆర్‌డీ అధికారులను కలిసిన అనంతరం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాలని విద్యార్థులు నిర్ణయించారు. దీంతో మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు – విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందిని అరెస్ట్‌ చేశారు.