హర్యానా కోసం రంగంలోకి దిగిన హేమ హేమీలు !!!

5
haryana elections

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోరాదని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రచార కర్తలుగా హేమాహేమీలను బరిలోకి దించుతోంది. ఇందుకు సంబంధించిన ప్రధాన ప్రచారకర్తల జాబితాను పార్టీ అధిష్ఠానం శుక్రవారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా ప్రధాన ప్రచారకర్తలుగా ప్రచారం సాగిస్తారు. వీరితో పాటు, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, స్మృతి ఇరానీ, పీయూష్ గోయెల్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, వీకే సింగ్‌ కూడా ప్రచారం సాగించనున్నారు. సహాయ మంత్రులు ఇంద్రజిత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్, రత్తన్ లాల్ కటారియా తదితరులు సైతం ప్రచారంలో పాల్గొంటారు.

కాగా, హేమమాలిని, సన్నీడియోల్, హన్స్‌ రాజ్ హన్స్ వంటి సెలబ్రెటీలు సైతం హర్యానా ప్రచార కర్తల జాబితాలో చేటు సంపాదించుకున్నారు. వీరంతా ర్యాలీలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని రాబోయే రోజుల్లో ఉధృతం చేయనున్నారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టార్ నాయకత్వంలో విజయమే లక్ష్యంగా 75కు పైగా సీట్లు సంపాదించాలని అమిత్‌షా టార్గెట్‌ విధించారు. మొత్తం రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. హర్యానాలో రాబోయే రోజుల్లో 100కు పైగా పబ్లిక్ ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అక్టోబర్ 21న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 24న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.