నాన్నకు ప్రేమతో జార్ఖండ్ ఫలితాలు

6
hemanth soran

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో జేఎంఎం-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైన నేపథ్యంలో జేఎంఎం నేత, కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ విజయం ఒక మైలురాయి గా అభివర్ణించారు.
మీడియాతో ఆయన తన ఆనందాన్ని పంచుకుంటూ, ఈ విజయాన్ని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు అంకితం చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌, ఇతర నేతలందరికీ తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలని అన్నారు.

‘దిషోం గురు శిబు సోరెన్ చేసిన కఠోర శ్రమ, పోరాటం ఫలితమే ఈ విజయం. రాష్ట్రం ముందున్న లక్ష్యాలను సాధించుకునే సమయమిది. జార్ఖండ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ విజయం ఓ మైలురాయి. సమాజంలో వర్గాలు, కులాలకు అతీతంగా అందరి అంచనాలు, కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నాను. దీనిపై త్వరలోనే భాగస్వామ్య పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తాను’ అని హేమంత్ సోరెన్ తెలిపారు.