దీదీపై హైకోర్టులో పిటిషన్లు….

4
mamata banerjee

 కేంద్రంలోని ఎన్డీయే సారధ్యంలోని  బిజెపి ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాలు,అసోం ,ఢిల్లీ తదితర చోట్ల ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఈ చట్టాన్ని విమర్శిస్తున్నాయి. మరోపక్క తమ రాష్ట్రాల్లో అమలుచేయబోమంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈనేపధ్యంలో   తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మంగళవారంనాడు మూడు పిటిషన్లు కోల్‌కతా హైకోర్టులో దాఖలయ్యాయి.

     అడ్వకేట్లు, ఓ వ్యాపారవేత్త వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బిశ్వంత్ సోమద్దెర్ ముందు దాఖలు చేశారు.పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ (సవరణ) చట్టం-2019 (సీఏఏ)ని అమలు చేయరాదని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయంపై మొదటి పిటిషన్ దాఖలైంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కోల్‌కతాలో భారీ నిరసన ప్రదర్శన జరిపారు.

     పశ్చిమబెంగాల్‌లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీని అమలు చేసేది లేదని కూడా ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. కాగా, సీఏఏను అమలు చేసేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇవ్వడమే కాకుండా, ఆ ప్రకటనల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని రెండవ పిటిషన్ సవాలు చేసింది. కోల్‌కతా మేయర్ ఫరీద్ హకీంను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని కోరుతూ మూడో పిటిషన్ దాఖలైంది. ఈ అంశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు వస్తుందట. మొత్తానికి పౌరసత్వ బిల్లు ఎన్ని మలుపులు తిప్పుతుందో చూడాలి.