స్కూళ్ల రూపు రేఖల మార్పులో నాణ్యత ఉండాల్సిందే 

7
naadu-needu

    ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి వివిధ పధకాలను ప్రవేశపెడుతూ సమీక్షలు కూడా చేస్తున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా  ‘నాడు–నేడు’, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ.. తదితర అంశాలపై ఆయన పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నాడు–నేడు’ పనుల్లో నాణ్యత ముఖ్యమని, ఈ విషయంలో ఎక్కడా రాజీపడొద్ద అధికారులను ఆదేశించారు.

     స్కూళ్లలో బాత్‌రూములు రన్నింగ్‌ వాటర్‌తో పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం చెప్పారు. గ్రామాల పర్యటనలకు వెళ్లినప్పుడు తానే ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లను స్వయంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు.  మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో ‘నాడు–నేడు’ పనులు చేపడుతున్నామని, ఇందులో పాల్గొనే 1100 మంది ఇంజనీర్లకు 55 మంది మాస్టర్‌ ట్రయినర్ల ద్వారా శిక్షణ ఇచ్చామని ఈసందర్బంగా  అధికారులు చెప్పుకొచ్చారు

     మండలాల స్థాయిలో 2010 మందికి, పేరెంట్స్‌ కమిటీల్లోని 50 వేల మందికి వచ్చే నెలలోపు శిక్షణ పూర్తి చేయనున్నామని అధికారులు వివరించారు. అధికారులు చెప్పిన విషయాలను విన్నాక,  పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అన్ని పనులు వంద శాతం నాణ్యతతో ఉండాలని సీఎం జగన్  స్పష్టం చేశారు. రెండో విడతలో నాడు–నేడు కింద చేపట్టే పనులను జూన్‌ నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.