నారాయణా .. నారాయణా .. ఎక్కడా కనపడ్డం లేదు?

4
anakapalle mla gudivada amarnath

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన నారాయణ ఇప్పుడు కనిపించడం లేదా? ఎక్కడున్నారో తెలీదా? ఇది ఎవరో అంటే పర్వాలేదు. సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే అంటున్నారు. “టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి సీఆర్డీఏ పరిధిలో అప్పటి మంత్రి నారాయణ పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం మాజీ మంత్రి నారాయణ అప్రూవర్‌గా మారి వాస్తవాలు చెబితే స్వాగతిస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. గురువారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నా నారాయణ కనిపించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అమరావతిలో అక్రమాలు నారాయణ చెప్పాలనుకుంటే చెప్పొచ్చని, చంద్రబాబు నుంచి ఎలాంటి హానీ లేకుండా రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు.

‘మాజీ మంత్రి నారాయణ కనిపించడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో బయటకు రావాలి. అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నా ఆయన మాత్రం కనిపించడం లేదు. అసలు అమరావతిని ఇలా ఎందుకు నిర్మించారో మాజీ మంత్రి నారాయణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక చంద్రబాబు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన వెంట అనుచరులు తప్ప, రైతులెవరు మాకు కనిపించలేదు. ఒక అసాంఘిక శక్తిగా చంద్రబాబు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుంచి దృష్టి మరల్చేందుకే బాబు యత్నించారు. రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ బాబు అండ్‌ కో బాగా నటించారు. కొనుకున్న భూములకు రేట్లు రావాలనేదే వారి తాపత్రాయం’అని అమరనాధ్ వ్యాఖ్యానించారు.

అమరావతి జేఏసీ అంటే జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కాదని, జాయింట్‌ యాక్టింగ్‌ కమిటీ అని గుడివాడ అమరనాధ్ చెబుతూ, ఎందుకంటే ఆ కమిటీలో ఉన్న వారంతా యాక్టర్లే నన్నారు. ‘రాజధాని పేరుతో చంద్రబాబు ఎన్ని కోట్లు తిన్నారనేది ప్రతీ ఒక్కరికి తెలుసు. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి. చంద్రబాబు మాట్లాడితే జైలుకి పంపండి అంటున్నాడు. ఆయనకు ఆ కోరిక త్వరలోనే తీరనుంది. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ‘అని ఆయన పేర్కొన్నారు. ‘ ఇక గత అయిదేళ్లలో టీడీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు దోచుకున్నారు. త్వరలో టీడీపీ నేతలు చేసిన అవినీతిని బయటపెడతాం. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్యే. ఇది తెలుగు ప్రజల సమస్య కాదు’ అని వ్యాఖ్యానించారు.