పరస్పరం మాట్లాడుకోవద్దంటూ నిర్భయ దోషులపై ఆంక్షలు…

4

అప్పట్లో ఢిల్లీలో సంచలనం రేపిన  నిర్భయ హత్యాచార ఘటనలో నలుగురు దోషులకు త్వరలో ఉరి తీయనున్న నేపథ్యంలో తీహార్ జైల్లో పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. నిర్భయ దోషుల భద్రత కోసం తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని తీహార్ జైలుకు రప్పించారు.

మండోలీ జైల్లో ఉన్న నిర్భయ కేసులో దోషి  పవన్ కుమార్ గుప్తాను అత్యంత రహస్యంగా సాయుధ గార్డుల భద్రత మధ్య తీహార్ జైలుకు తరలించారు. కాగా   నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముకేశ్‌, వినయ్‌ శర్మ,అక్షయ్‌ కుమార్‌సింగ్‌‌లు పగలు జైల్లో కలిసి ఒకరికొకరు గతంలో  మాట్లాడుకునే వారు. ఈ నలుగురికి ఉరిశిక్ష అమలు చేసే తేదీ దగ్గర పడుతున్నందున  ఒకరికొకరు మాట్లాడుకోకుండా వేర్వేరు జైలు గదుల్లో వారిని ఉంచారు.

నలుగురు దోషులు ఒకచోట కలిసి మాట్లాడుకోవడంపై తీహార్ జైలు అధికారులు నిషేధం విధించారు. తీహార్ జైల్లోని ఉరి తీసే గదిని శుభ్రం చేశారు. ఉరి స్తంభం వద్ద ఇనుప లివర్ తుప్పుపట్టడంతో దాన్ని జైలు అధికారులు శుభ్రం చేయించారు. ఉరి తీసే ఛాంబరులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, జైలు వార్డర్ల భద్రతను ఏర్పాటు చేశారు. తలారి పవన్ కూడా ఉరి తీయడానికి సమాయత్తం అవుతున్నాడు.