సొంత గూటికి వెళుతున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్???

3
addanki mla gottipati ravikumar

ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసి అద్దంకి నుంచి విజయకేతనం ఎగురవేసిన గొట్టిపాటి రవికుమార్ తిరిగి తన సొంత గూటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అసలు గొట్టిపాటి నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటి అన్న దానిపై ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

అద్దంకి నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి విజయకేతనం ఎగురవేశాడు గొట్టిపాటి రవికుమార్. 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రవికుమార్, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ టిడిపిలో చేరడం తో వైసీపీ శ్రేణులు షాక్ కి గురయ్యారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టిడిపి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గొట్టిపాటికి కష్టాలు మొదలయ్యాయి. టిడిపి నాయకులను టార్గెట్ చేసి కేసులు బనాయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ పార్టీని వీడాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అందుకు తగ్గట్టు వైసీపీలో కీలక నేతలు కూడా గొట్టిపాటి రవికుమార్ కు టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గ పరిస్థితుల గురించి, తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అరగంటపాటు చంద్రబాబుతో తన ఇబ్బందులను గురించి చర్చించారు.

చంద్రబాబు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అండగా ఉంటానని గొట్టిపాటికి హామీ ఇచ్చారని సమాచారం.పార్టీ వీడే ఆలోచన మాత్రం చెయ్యొద్దని సూచించారని తెలుస్తుంది. అయినప్పటికీ గొట్టిపాటి రవికుమార్ వైసిపిలోకి వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకు ముఖ్య కారణం గొట్టిపాటి రవికుమార్ కు అద్దంకి నియోజకవర్గం లో ఉన్న గ్రానైట్ వ్యాపారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విజిలెన్స్ దాడులతో గొట్టిపాటి రవికుమార్ కు సంబంధించిన బల్లికురవ, చీమకుర్తి లో ఉన్న గ్రానైట్ వ్యాపారం నిలిచిపోయింది.

అప్పటినుండి వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవికుమార్ ఇదే విషయాన్ని చంద్రబాబు తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తాజాగా ఆయన టిడిపికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని చూస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది. గ్రానైట్ వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు వ్యాపారం నిలిచిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులు ఒకవైపు, జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు మరోవైపు, వైసీపీ నేతలు ఒత్తిడి ఇంకొకవైపు.. ఇవన్నీ ఆయన టిడిపిని వీడి వైసీపీ వైపు చూస్తూ ఉండడానికి కారణాలు అని తెలుస్తుంది.

ఇక ఇదే విషయమై గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలోని తన అనుయాయులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గొట్టిపాటి రవికుమార్ టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో కి వస్తే ఆయనకు పర్చూరు నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించాలని కూడా వైసిపి నాయకులు భావిస్తున్నారని సమాచారం. అందుకే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రవికుమార్ ను తిరిగి ఆహ్వానిస్తున్నారు వైసీపీ నేతలు. మరి గొట్టిపాటి ఏం నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే తేలనుంది. ఒకవేళ గొట్టిపాటి రవికుమార్ టీడీపీని వీడి వెళితే టీడీపీకి మరో గట్టిదెబ్బ తగిలినట్టే .