మొన్నటి ఎన్నికల్లో ఈ అస్త్రం ఉపయోగిచటం మరిచింద కాంగ్రెస్ ..!!

3
congress

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారానికి ఈనెల 19 సాయంత్రంతో తెరపడనుంది. 21న పోలింగ్ ని ర్వహిం చి, 24న ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ కొద్ది సమయాన్ని సమర్థంగా సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. చివరగా ముఖ్య నేతలను ప్రచారానికి దింపుతున్నాయి.

గురువారం సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతుండగా, 18, 19 తేదీల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్డు షో ఖరారైంది. ప్రధానంగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన భార్య పద్మావతిని గెలిపించుకునేందుకు ఆయన సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు.

ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలంగాణ ఉద్యమకారుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే టీఆర్ఎస్‌కు వ్యతిరేఖంగా ఉద్యమకారులను ఏకం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ వేదికగా ఉద్యమకారులతో త్వరలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు కాం గ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలు, ఆకాంక్షలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు, సంఘాలు టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీన్ని అనుకూలంగా మలుచుకుని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఉత్తమ్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఆత్మీయ సమ్మేళనంలో ఇదే అంశాన్ని ప్రస్థావించి, ఉద్యమకారుల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, కానీ టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారిపోయాయని, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదనే అంశాన్ని ఈ సభలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. అంతేగాక నాడు తెలంగాణ బద్ధవ్యతిరేకులుగా పనిచేసిన నేతలను సీఎం కేసీఆర్ అక్కన చేర్చుకుని, ఉద్యమకారులకు ద్రోహం చేస్తున్నారనే సందేశాన్ని ప్రజలల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.