విజయ్ దేవరకొండ న్యూమరాలజీ పాటిస్తున్నాడా?

3
Vijay Devarakonda is practicing numerology

మొదట్లో వరుస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకొచ్చి, స్టార్ హీరో రేంజ్ కి చేరిన విజయ్ దేవరకొండ ఈమధ్య నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయ్. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నాలుగు గెటప్స్ లో నటిస్తున్నాడు. దీని టీజర్ తాజాగా విడుదల అయింది. నాలుగు విభిన్న గెటప్పులు, నలుగురు హీరోయిన్లు, ఇంటెన్స్ గా ఉండడంతో టీజర్ యూత్ ను ఆకర్షిస్తోంది.

‘ఒక వ్యక్తి జీవితంలో నాలుగు దశలలో జరిగిన కథా, లేక మరేదైనా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుందా ఈ నాలుగు గెటప్ లలో.. ‘ అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కానీ ఈ టీజర్ ‘అర్జున్ రెడ్డి’ ని గుర్తుకు తెస్తోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా టీజర్ లో రౌడీగారి పేరును ‘దేవరకొండ విజయ్ సాయి’ అంటూ టైటిల్ క్రెడిట్ ఇవ్వడంతో విజయ్ న్యూమరాలజీ ప్రకారం ఇలా మొత్తం పేరును వేసుకున్నాడా అని కొందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే, ఈమధ్య విజయ్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరచడంతో న్యూమరాలజీని ఆశ్రయించాడని టాక్.

ఇదేదీ కాదని,నిజానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కూడా విజయ్ పేరును ‘దేవరకొండ విజయ్ సాయి’ అనే టైటిల్ క్రెడిట్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. అప్పట్లో దర్శకుడు సందీప్ వంగా తీసుకున్న నిర్ణయమట. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్‘ విషయానికి వస్తే దర్శకుడు క్రాంతి మాధవ్ కు సాయిబాబా అంటే చాలా నమ్మకమట. అందుకే సాయి పేరును అలానే ఉంచుతూ ‘దేవరకొండ విజయ్ సాయి’ అనే టైటిల్ క్రెడిట్ ఇచ్చారు గానీ,ఇందులో రౌడీగారి ప్రమేయం ఏమీ లేదట. అయినా న్యూమరాలజీ లాంటి వాటిపై విజయ్ కి పెద్దగా నమ్మకం లేదట. రెండు సందర్భాలలో దర్శకులే రౌడీగారి ఎకడమిక్ సర్టిఫికెట్స్ లో ఉన్న పేరునే ఉపయోగించారు. ఈ సినిమా అయినా విజయ్ కి బ్రేక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.