21 Indian Navy personnel tested positive for Covid-19
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా కేసులు పెరుగుతూనే ఉండడంతో మహారాష్ట్ర సర్కార్ అన్ని చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు భారత నావికాదళంలో కరోనా వైరస్ ప్రమాద గంటలు మోగిస్తోంది. భారత యుద్ద నౌకలు, జలాంతర్గాముల్లో పనిచేస్తున్న నావికాదళం సిబ్బంది 20మందికి కరోనా వైరస్ సోకింది. భారత నావికాదళ యుద్ద నౌకలు, జలాంతర్గాముల్లో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో వారిని ముంబై నగరంలోని కొలాబాలోని ఇండియన్ నేవీకి చెందిన అశ్వినీ ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
నావికాదళం సిబ్బందికి కరోనా సోకిన ఘటనతో తాము యుద్ద నౌకలు, జలాంతర్గాముల్లో వైరస్ లేకుండా శానిటైజ్ చేయించామని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ చెప్పారు. కరోనా ప్రబలుతున్నందున భారత నావికాదళంలో అనవసరమైన శిక్షణ, సమావేశాలు, ప్రయాణాలను రద్దు చేశామని నేవీ అధికారులు చెప్పారు.నావికాదళం సిబ్బంది ఉన్న చోట నుంచి పనిచేయడం, ఎక్కువమంది గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాగా గతంలో భారత సైన్యంలో పనిచేస్తున్న 8మందికి కరోనా వైరస్ సోకిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నారావణే చెప్పారు. కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చిన సైనిక సిబ్బందిని ప్రత్యేక రైళ్లలో బెంగళూరు నుంచి జమ్మూ, గౌహతీలకు పంపించామని ఆర్మీ చీఫ్ చెప్పారు.
ఇక ముంబైలో కరోనా కేసుల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూలు) నిండిపోయాయి. ఐసీయూల్లో ఒక్క పడక కూడా ఖాళీ లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారు తున్నాయి. సమయానికి వెంటిలేటర్ ఉండి ఆక్సిజన్ అంది ఉంటే నిలబడే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బుధ, గురువారాల్లో ఇలా ఇద్దరు మృత్యువుతో పోరాడి చనిపోయారు. ముంబై జనాభా సుమారు 2.20 కోట్లు కాగా 200 ఐసీయూ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. నగరంలో కరోనా కేసులు ఇప్పటికే రెండువేలు దాటాయి. గత ఆరు రోజుల్లో కేసులసంఖ్య రెట్టింపైంది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గరైన 49 ఏళ్ల వ్యక్తిని కస్తూరిబా ఆస్పతిల్రో చేర్పించారు. అతని ఆరోగ్యం విషమించడంతో ఐసీయూ బెడ్ ఖాళీగా ఉన్న ఆస్పత్రికి తరలిద్దామని వేచి చూశారు. కానీ, ఎక్కడా ఖాళీ లేక బుధవారం రాత్రి అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 194 మరణాలు నమోదయ్యాయి.