Acham Naidu and Nimmala Ramanaidu comments on YSRCP:
స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో సీఎం జగన్,ఎంపీ విజయసాయిరెడ్డి సహా వైసిపి నేతలు చేసున్న విమర్శలు దారుణంగా ఉన్నాయని టిడిపి నేతలు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ ఉపనేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే రోజులే ప్రచార వ్యవధి ఇస్తూ ప్రభుత్వం షెడ్యూల్ తయారు చేసి ఇస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) దానిని పాటించారు. ఏ తేదీల్లో ఏ ఎన్నికలు పెట్టాలో ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తే కమిషనర్ మారు మాట్లాడకుండా అవే తేదీలను ప్రకటించారు. ఆరోజు ఆయన కులం గుర్తు రాలేదు. మీరు ఆడమన్నట్లు ఆడితే ఎన్నికల కమిషనర్ మంచివాడు.. పునీతుడు. లేకపోతే దుర్మార్గుడు. వెంటనే ఆయన కులం గుర్తుకు వస్తుంది’ అని వారు ఎద్దేవా చేసారు.
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైర్‌సను ఎలా అదుపు చేయాలన్నదానిపై తీవ్ర ప్రయత్నాల్లో మునిగి తేలుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మాత్రమే కరోనా లేనే లేదని వాదిస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తోందని విమర్శించారు. ‘ఎన్నికలంటే భయపడి టీడీపీ కరోనా గురించి మాట్లాడుతోందా? మీ పార్టీ పుట్టి బోడి పదేళ్లు కాలేదు. మా పార్టీ పుట్టి 40 ఏళ్లు. ఇలాంటి ఎన్నికలను ఎన్నో చూశాం. ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ సామాజిక బాధ్యత ఉన్న పార్టీగా మేం మాట్లాడాం’ అని అచ్చెన్నాయుడు చురకలంటించారు.
కాగా మాజీ సీఎం చంద్రబాబు మంగళవారం ట్వి టర్లో స్పందిస్తూ, ‘ఎన్నికలు వాయిదా పడితే.. ఎంపీలతో ఒత్తిడి చేయించో, కేంద్రానికి లేఖలు రాసో, రాష్ట్రానికి రావలసిన నిధులు అడిగి తెచ్చుకోవచ్చు. కానీ మీ బెదిరింపులకు భయపడి పారిపోయిన కంపెనీలు, పెట్టుబడులు, ఉద్యోగాలను మళ్లీ ఏ విధంగా తేగలం? రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్ తల్చుకుంటే బాధేస్తోంది’ అని వాపోయారు. ‘ప్రకాశం జిల్లాలో 24 వేల కోట్ల పెట్టుబడి, 4 వేల ప్రత్యక్ష, 12 వేల పరోక్ష ఉద్యోగాలను ఇచ్చే ఆసియన్ పేపర్ మిల్స్‌ను తరిమేశారు’ అని ఆయన పేర్కొన్నారు.