ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకి శాసనసభ ఆమోదం తెలిపి మండలి ఆమోదం కోసం పంపితే, సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. ఈవిధంగా శాసనసభలో నెగ్గుకు రాలేకపోయిన టిడిపి, తనకు బలమున్న మండలిలో ప్రతాపం చూపించింది. ఆవిధంగా అక్కడ ప్రభుత్వానికి సరైన సంఖ్యా బలం లేకపోవడంతో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. మొత్తం మీద ఎత్తుకు పై ఎత్తులతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బిల్లులని మండలిలో బలం లేని కారణంగా టీడీపీ అడ్డుకోవడం వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది.
అయితే వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తాజా పరిణామాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించారంటూ ఫైర్ అయ్యారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. మహా అయితే కొన్నాళ్ల పాటు వాయిదా వేయించడం తప్ప ఏమీ చేయలేరన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో తమ పార్టీ తలుచుకుంటే మండలిలో మెజారిటీ రావడం ఎంతసేపు అని చెప్పుకొచ్చారు.
అంతటితో అంబటి ఆగలేదు, ఒకవేళ వైసీపీ గనుక వక్ర మార్గంలో వెళ్లాలనుకంటే, మండలిలో మెజారిటీ సాధించడం ఎంతసేపు అని వ్యాఖ్యానించారు. అయితే అలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తమ విధానం కాదు గనుకనే గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మండలిలో మెజారిటీ లేకపోతే ఫిరాయింపులను ప్రోత్సహించారని, అయితే తాము అలా చేయదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారని, మండలి ఛైర్మనో.. చంద్రబాబో కాదని అంబటి అన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ ను చంద్రబాబు ప్రభావితం చేశారని అంబటి ఆరోపించారు. గ్యాలరీలో షరీఫ్ కు ఎదురుగా కూర్చొని, తాను చెప్పినట్టు చేయాలన్న సంకేతాలిచ్చారన్నారు.ఒకవేళ తమ నిర్ణయం ప్రజలకు నచ్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో వారే వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అందుకే ఆయన పార్టీని కేవలం 23 స్థానాలకు పరిమితం చేశారని ఆయన గుర్తు చేసారు.