ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను సాగిస్తున్నాడు. అయితే గతంలో కొన్ని సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్ చాలా మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోయారు.
అయితే ఇప్పటికే తను ఎన్నికల ముందు మాట ఇచ్చిన ఎమ్మెల్యేలకు, ముందు నుంచి తనతో ఉన్న మరికొందరు నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉన్న లక్ష్మీ పార్వతి విషయంలో మాత్రం ఇంతవరకు సైలెంట్‌గా ఉన్న జగన్ తాజాగా ఆమెకు కీలక పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మీ పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల ఆర్టీసీ చైర్మెన్ పదవి ఖాలీ అవ్వడంతో ఆ పదవిని జగన్ లక్ష్మీ పార్వతికి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికి, ఆ పదవి కాకుండా ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా ఆమెకు బాధ్యతలను అప్పగించారు జగన్.