మొన్న విశాఖ గ్యాస్ లీక్ ఘటన మరవకముందే ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని మలికిపురం మండలం తూర్పుపాలెం దగ్గర ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌కు వెళ్లే పైప్‌లైన్ పగిలిపోవడంతో భారీగా గ్యాస్ వెలువడుతోంది. వెంటనే స్థానికులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం అందించగా, రంగంలోకి దిగిన ఓఎన్జీసీ సిబ్బంది లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గ్యాస్ లీకేజి కి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ ఘటనతో అక్కడి స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి.