APSRTC to restore the services from April15th
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అమలవుతున్న దేశవ్యాప్త లాక్డౌన్ గడువు ఏప్రిల్ 14తో ముగియనుండటంతో ఏపీలో ప్రజా రవాణాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆన్లైన్లో ఏప్రిల్ 15 నుంచి టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చేసినప్పటికీ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం విశేషం. ఒకవేళ లాక్డౌన్ డెడ్లైన్ గడువు ముగిశాక బస్సులను అందుబాటులోకి తెచ్చినా ఏసీ బస్సులను ప్రస్తుతానికి నడపకూడదని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది.
చల్లని వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఏసీ బస్సుల గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ(నాన్ ఏసీ) బస్సులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. అయితే.. ఏపీలోని ప్రధాన నగరాల మధ్య మాత్రమే బస్సులు నడుపుతారా లేక ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులను అందుబాటులోకి తెస్తారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ కూడా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో లాక్డౌన్ డెడ్లైన్ ముగిశాక కేంద్రమే రాష్ట్రాలకు బస్సుల రాకపోకలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తారని టాక్.
కాగా తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతానికైతే ఆన్లైన్ రిజర్వేషన్ సేవలను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. కేంద్రం లాక్డౌన్ గడువును పొడిగిస్తే ఇబ్బందులుంటాయన్న దృష్ట్యా టికెట్ రిజర్వేషన్ సేవలను అందుబాటులోకి తీసుకు రాలేదని అంటున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ లాక్డౌన్ ఎత్తివేతపై కేంద్రం పునరాలోచనలో ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతానికి టికెట్లను బుక్ చేసుకోకపోవడమే మంచిదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఏది ఏమైనా 14తర్వాతే అంతిమ నిర్ణయం ఉంటుంది.