Attack On Hindu Temples
రాష్ట్రంలో హిందూ విగ్రహాల విధ్వంసం కొనసాగుతుంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో చోటు చేసుకున్న ఘటన వల్ల చెలరేగిన ప్రకంపనలు సద్దుమణగకముందే.. అలాంటి ఉదంతాలే వెంటవెంటనే మరో రెండు సంభవించాయి. చారిత్రాత్మక రామతీర్థ క్షేత్రంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలను వేరు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. మరో రెండు విగ్రహాల ధ్వంసానికి పూనుకోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. జగన్ సర్కార్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని కోమాలమ్మ అమ్మవారి పాదాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అమ్మవారి పాదముద్రలను పగులగొట్టారు. అయితే కోమాలమ్మ అమ్మవారి పాదముద్రలను ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు భక్తిప్రపత్తులతో పూజిస్తుంటారు. విశాఖపట్నం నుంచి వంట్లమామిడికి వెళ్లే మార్గంలో ఉంటాయి కోమలామ్మ అమ్మవారి పాదముద్రలు. మోదకొండమ్మ అమ్మవారికి చెల్లెలుగా భావిస్తుంటారు స్థానిక గిరిజనులు. తాజాగా ఆ విగ్రహం పాదాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
ఇదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో గల సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి చెందిన రెండు చేతులు కూడా ధ్వంసం అయ్యాయి. దుండగులు స్వామివారి అభయ హస్తాలను పగులగొట్టారు. విగ్రహం చేతులు పగిలి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన వారి కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి: