Delhi Riots | Bengali Actress Subhadra Mukherjee quits BJP
ఢిల్లీ అల్లర్ల ప్రభావం పశ్చిమ బెంగాల్ ని తాకింది. దాంతో ప్రముఖ బెంగాలీ నటి సుభద్రా ముఖర్జీ బీజేపీకి రాజీనామా చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోనందుకు నిరసనగా తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె వెల్లడించారు. కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాగూర్ వంటి నేతలున్న బీజేపీలో తాను కొనసాగలేనని ఆమె స్పష్టంచేసారు. తాను ఎన్నో ‘‘ఆశలతో’’ బీజేపీలో చేరాననీ ఆమె చెబుతూ,అయితే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. బీజేపీ పార్టీ తన సిద్ధాంతాల నుంచి ‘‘పక్కకు వెళ్లిపోతున్నట్టు’’ గా ఉందన్నారు.
నరేంద్రమోదీ ప్రభుత్వం ద్వారా పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు తాను మద్దతు ఇచ్చాననీ సుభద్రా ముఖర్జీ పేర్కొంటూ, అయితే బీజేపీ దీనిపై చేస్తున్న ప్రచారానికి తాను వ్యతిరేకమన్నారు. ‘‘సీఏఏ కారణంగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొంది. స్వతంత్ర భారత దేశంలో ఎన్నో ఏళ్లుగా నివసించిన తర్వాత కూడా పౌరసత్వాన్ని నిరూపించునేందుకు పత్రాలెందుకు చూపాలి?’’ అని ఆమె ప్రశ్నించారు. ఇటీవల 46 మందిని బలితీసుకున్న ఢిల్లీ అల్లర్ల వంటివి పునరావృతం కాకూడదన్నారు.
‘‘విద్వేషపూరిత వాతావరణంతో ఢిల్లీని నింపేశారు. అనురాగ్ ఠాగూర్, కపిల్ మిశ్రా వంటి నేతలు తమ విద్వేష వ్యాఖ్యలతో పరిస్థితిని మరింత దిగజార్చినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. చర్యలు తీసుకోవడంలో పక్షపాతం చూపించే ఓ పార్టీలో నేను ఎలా ఉండగలను..?’’ అని సుభద్ర సూటిగా ప్రశ్నించారు. ప్రజలను తోటి మనుషుల్లా కాకుండా వారిని ‘మతం ఆధారంగా చూసే పార్టీని తాను పార్టీగా గుర్తించనని ఆమె స్పష్టం చేసారు.