BJP vishnuvardhan reddy shocking comments on home quarantine notice
కర్నూల్ రెడ్ జోన్ లో పర్యటించి,లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించినందున హోంక్వారంటైన్లో ఉండాలని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి కి పోలీసులు నోటీసులు ఇచ్చిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ వార్తలపై విష్ణువర్థన్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, తనకు హోంక్వారంటైన్లో ఉండాలంటూ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుందని, దేశంలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు తనకుందని తెలిపారు.
అయితే కొందరు అవగాహన లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు. స్థానిక సీఐ, ఎస్సైలు సరైన అవగాహనలేక పొరపాటుగా ఇచ్చిన నోటీసులు గా భావిస్తున్నానని ఆయన అన్నారు. నిజానికి 24 గంటల పాటు తనకు సెక్యూరిటీ ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనకు భద్రత కల్పిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఇస్తేనే వెళ్లానని విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.
అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పర్యటిస్తున్న వైసీపీ మంత్రుల్ని క్వారంటైన్లో పెడతారా? అని ప్రశ్నించారు. సామాజికసేవ చేస్తున్నవారికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని కూడా ఆయన విమర్శించారు. కాగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు స్థానిక వైసీపీ నేతల ఒత్తిడి వల్లే నోటీసు ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.