British Prime Minister Boris Johnson recovered with wife scanning report
కరోనా మహమ్మారిని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఎదిరించి నిలబడ్డారు. తనకు సోకిన కోవిడ్-19పై యుద్ధం చేసి గెలిచి వీరునిగా నిలిచారు. మూడు రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందిన ఆయన ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తనకు సేవలందించిన సెయింట్ థామస్ ఆసుపత్రి సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో చేరిన వారం తర్వాత కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపారు.
ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మూడు రోజులపాటు చికిత్స పొందారని తెలిపారు. లండన్ శివార్లలో ఉన్న ఆయన ఫార్మ్ హౌస్ చెకర్స్‌లో విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. వైద్య బృందం సలహా మేరకు బోరిస్ జాన్సన్ ఇప్పటికిప్పుడే విధుల్లో పాల్గొనబోరని తెలిపారు. బోరిస్ జాన్సన్‌కు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు మార్చి 27న గుర్తించారు. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థరణ కావడంతో గత ఆదివారం ఆయనను సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయించారు.
సోమవారం సాయంత్రం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించి చికిత్స చేశారు. గురువారం ఆయనను సాధారణ వార్డుకు తరలించారు. అయితే బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో ఉండగా ఆయన జీవిత భాగస్వామి కేరీ సైమండ్స్ రాసిన లేఖ ఆయనలో ఉత్తేజాన్ని పెంచిందని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిథి తెలిపారు. ఈ దంపతుల తొలి బిడ్డ త్వరలో జన్మించబోతోంది. ఆమె రాసిన లేఖతోపాటు గర్భంలో ఉన్న శిశువు స్కానింగ్ కూడా ఆమె పంపడంతో వాటిని చూసిన బోరిస్ నూతనోత్తేజం పొందారు.