British Queen Elizabeth Shocking Decision over coronavirus
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా బారిన చిక్కుకుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా చెప్పుకునే బ్రిటన్ లో కూడా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 93 సంవత్సరాల క్వీన్ ఎలిజబెత్ ప్రస్తుతం విండ్సర్ కేజిల్లో సెమీ సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఇక బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్కు కోవిడ్-19 పాజిటివ్ అని గత వారం నిర్థరణ కావడంతో, ఆయన సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారు. శుక్రవారంతో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ ముగుస్తుందని భావించినప్పటికీ, కోవిడ్-19 లక్షణాలు ఇంకా ఉన్నందున ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ కొనసాగిస్తున్నారు.
ఇక జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం నోవల్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 10.30 లక్షలకు పైగా నమోదయ్యాయి, వీరిలో 54 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ను కూడా ఈ వైరస్ తీవ్రంగా వేధిస్తోంది. తాజా సమాచారం ప్రకారం బ్రిటన్లో ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 34 వేల పై మాటే. దీని కారణంగా 2,900 మందికి పైగా మరణించారు. ఇలా కరోనా వైరస్ మహమ్మారి వేధిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించబోతున్నారు.
రాజ కుటుంబం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్ ఆదివారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు యునైటెడ్ కింగ్డమ్, కామన్వెల్త్లను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపింది. రేడియో, టెలివిజన్ ద్వారా ఆమె ప్రసంగం ప్రసారమవుతుందని పేర్కొంది. అదేవిధంగా రాజ కుటుంబపు సామాజిక మాధ్యమాల చానళ్లలో కూడా వీక్షించవచ్చునని వివరించింది. బ్రిటిష్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం క్వీన్ ఎలిజబెత్ ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన కరోనా వైరస్ మహమ్మారి సమస్యపై మాట్లాడతారు. ఆమె ప్రసంగాన్ని విండ్సర్ కేజిల్లో రికార్డు చేశారని, ఈ రికార్డెడ్ ప్రసంగం ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుందని పేర్కొంది.