Sunday, January 24, 2021

Latest Posts

ఏపీలో పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలోకి నెట్టిందన్న చంద్రబాబు

Chandrababu Naidu Fires On AP Govt Over Present Situation on corona

ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ‘‘పెనం మీదనుంచి పొయ్యిలోకి నెట్టింది’అని ఆయన విమర్శించారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయని…వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆయన ఆరోపించారు. మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదన్నారు. అప్పుడు ‘‘కరోనా వస్తుంది, పోతుంది… పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని…ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను నిందించినా, టీడీపీని దూషించినా ప్రజల కోసం భరిస్తామని, కానీ రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని మాత్రం భరించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బయట పడుతుందన్నారు. వైసీపీ రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా టెస్టింగ్‌లపై లేదన్నారు. ‘మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి’ అంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు టీడీపీ అండగా ఉందన్నారు. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో కూడా నిబంధనలు వైసీపీ నేతలు పాటించలేదని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని… అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృతమైందని తెలిపారు. కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైసీపీ నేతల ధోరణి ఉంది తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్‌లోనూ యధేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. హెల్త్ బులెటిన్లను ఫార్స్‌గా మార్చారని వ్యాఖ్యానించారు.

కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కరోనా టెస్టింగ్‌లను నిర్లక్ష్యం చేయడమే రాష్ట్రంలో పెను విషాదంగా మారిందన్నారు. నాసిరకం పీపీఈలతో కరోనా వైద్య సిబ్బంది‌ని వైరస్‌పై యుద్ధానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే కాగలదని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకడం, వారిలో నలుగురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట గా ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ద ప్రజారోగ్యంపై లేదన్నారుఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునివ్వడం, వైసీపీ నాయకులంతా ర్యాలీలు జరపడం, నగదు పంపిణీ చేస్తూ ఓట్లు వేయాలని కోరడం, గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని మూల్యాలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss