రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఇపుడు ఫోకస్ అంతా మండలిపై పడింది. మండలి రద్దు దిశగా వైసిపి అడుగులు వేస్తోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కౌన్సిల్‌ను రద్దు చేస్తే తాము మళ్లీ పెడతామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.
నిజానికి తమ ఎమ్మెల్సీలందరిని కొనాలని సీఎం జగన్ చూశారని చంద్రబాబు మండిపడ్డారు. అయితే జగన్‌లాంటి అవినీతి పరులు మా పార్టీలో లేరని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో డబ్బులు లేవు అంటూనే రాజధాని రైతుల వ్యవహారంపై రూ.5 కోట్లు అడ్వొకేట్‌కి ఇస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దేశంలో ఉన్న అడ్వొకేట్లు అందరిని డబ్బులిచ్చి బ్లాక్ చేస్తున్నారని, రాజధాని తరపున వాళ్లు వాదిస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మయ సభను మరిపించేలా జగన్ తీరు ఉందని చంద్రబాబు ఎద్దేవా చేస్తూ, కౌరవులు కూడా ఇలాగే విర్రవీగారని పెక్రోన్నారు. చివరకు జాతీయ మీడియా కూడా జగన్ తీరును ఖండించాయని చంద్రబాబు ఆక్షేపించారు. రాజధాని అంశంపై ప్రజా బ్యాలెట్ పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలంతా మీ నిర్ణయాన్ని ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.