Tuesday, March 2, 2021

Latest Posts

మండిపోతున్న చికెన్ ధరలు… అప్పుడు వద్దని ఇప్పుడు ఎగబడుతున్నారు..

స‌రిగ్గా రెండు నెల‌ల క్రితం చికెన్ ధ‌ర‌లు ప‌త‌నావ‌స్థ‌లో కూరుకుపోయాయి. క‌రోనా వైర‌స్ దేశంలో అప్పుడ‌ప్పుడే ప్ర‌వేశించింద‌నే ప‌రిణామాల నేప‌థ్యంలో చికెన్ తినాలంటేనే జ‌నం భ‌య‌ప‌డిపోయారు. చికెన్ తో క‌రోనా వ‌స్తుంద‌నే అపోహ‌ల నేప‌థ్యంలో ముక్క ముట్ట‌డానికి జ‌నం ముందుకు రాలేదు. డిమాండ్ ప‌డిపోవ‌డంతో.. ధ‌ర ప‌త‌నం అయ్యింది. ఎంత‌లా అంటే.. ఆఖ‌రికి ప‌దికీ, పాతిక‌కు కూడా కేజీ చికెన్ అమ్మే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కొన్ని చోట్ల పౌల్ట్రీల ఓన‌ర్లు ఉచితంగా కోళ్ల‌ను పంచారు.

రెండు కేజీల కోడి 50 రూపాయ‌ల‌కు ఇచ్చిన వార్త‌లు కూడా వ‌చ్చాయి. కిలో చికెన్ ను పాతిక రూపాయ‌ల‌కు కొట్టించిన‌ట్టుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో పౌల్ట్రీల య‌జ‌మానులు బెంబేలెత్తిపోయారు. భారీ న‌ష్టాల్లో కూరుకుపోతున్న‌ట్టుగా విన్న‌వించుకున్నారు. ప్ర‌భుత్వానికి, మీడియాకు చెప్పి చికెన్ వ‌ల్ల క‌రోనా రాదు అనే ప్ర‌చారం చేయించుకున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లు రంగ‌లోకి దిగి చికెన్ ఫెస్టివ‌ల్స్ కు హాజ‌రై.. చికెన్ తిని చూపించారు. క‌రోనా రాదు ధైర్యంగా చికెన్ తిన‌మ‌ని వారు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

అయితే ప్ర‌జ‌లు అంత తేలిక‌గా చికెన్ జోలికి వెళ్ల‌లేదు. అయితే ఒక్క‌సారి లాక్ డౌన్ ప్రారంభం అయ్యాకా క‌థ మారింది. ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో చాలా మంది వ‌ర‌స పెట్టి చికెన్ తిన‌డం ప్రారంభించారు. వారానికి ఒక‌సారి అనే ద‌శ‌నుంచి వారంలో రెండూ, మూడు సార్లు కూడా చికెన్ త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. లాక్ డౌన్ తో ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో దిక్కుతోచ‌క వ‌ర‌స‌గా చికెన్ తిన‌డం చాలా మందికి అల‌వాటుగా మారింది. లాక్ డౌన్ కు పూర్వం చికెన్ సెంట‌ర్ల వైపుకు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డిన జ‌నాలు.. లాక్ డౌన్ ప్ర‌క‌టించాకా మాత్రం షాపుల ముందు క్యూలు క‌ట్టారు. దీంతో ఇప్పుడు డిమాండ్ పెరిగి..ఓ మోస్త‌రు ప‌ట్ట‌ణాల్లో కూడా కిలో చికెన్ ధ‌ర 250కి చేరింది! కొన్ని చోట్ల 300 రూపాయ‌ల‌కు కూడా ఉంది..ఇంత వ‌ర‌కూ చికెన్ ధ‌ర కిలోకి ఎప్పుడూ 300 రూపాయ‌ల  స్థాయికి చేర‌లేద‌ని, తొలి సారి ఇది జ‌రిగింద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే అతివృష్టి, కాక‌పోతే అనావృష్టి అన్న‌ట్టుగా, రెండు నెల‌ల కింద‌ట 30 రూపాయ‌లు క‌ష్టం అనుకున్న కేజీ చికెన్ ఇప్పుడు 300కు చేరిన‌ట్టుంది.

ఇది కూడా చదవండి: ఏ‌పిలో హైపో క్లోరైడ్ బదులుగా సున్నం పిచికారీ జల్లుతున్నారా?

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss