Closure of Borders in Tamil Nadu due to coronavirus:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశంలో తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పుడు తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైర్సని తేలిగ్గా తీసుకోవద్దని, ప్రజలంతా సంయమనంతో సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాకు అడ్డుకట్ట వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనా నిరోధక చర్యలను తీవ్రతరం చేసి, స్ర్కీనింగ్‌ను కఠితరం చేసింది. కేరళ, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో ఈ నెల 31వ తేదీ వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర సరుకులు రవాణా, అత్యవసర వైద్య సేవల వాహనాలు సహా నిర్ణీత వాహనాల రాకపోకలను మాత్రమే అనుమతిస్తామని శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించింది.
జనతా కర్ఫ్యూ, కరోనా నిరోధక చర్యలపై ప్రధాని శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్సింగ్‌లో తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.విజయభాస్కర్, రెవెన్యూశాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగం, ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులను కలిపే రహదారుల్లో నిర్ణీత వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, మిగతా వాహనాల రాకపోకలను శనివారం నుంచి 31వ తేదీ వరకు నిషేధిస్తున్నట్లు తెలిపారు.
అయితే పాలు, పెట్రోలు, డీజిల్, కాయగూరలు, మందులు, గ్యాస్ రవాణా వాహనాలు, అంబులెన్సులు ఉన్నాయి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి కోసం అతి తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతారు. అయితే ఈ వాహనాల్లో ప్రయాణించే వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి, వాహనాల్లో క్రిమిసంహారక మందులను చల్లుతారని, దేశ, రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజలు ఈ చర్యలకు సహకరించాలని సీఎం కోరారు. కాగా కరోనా నిరోధన ముందస్తు చర్యల్లో భాగంగా సేలంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో కొవిడ్-19 పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వెంటనే కేంద్రం ఏర్పాట్లు పనులు చేపట్టి, నమూనాల పరిశోధనలు కూడా ప్రారంభించామని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.