Wednesday, April 21, 2021

Latest Posts

కేంద్రాన్ని దుయ్యబట్టిన కేసీఆర్

CM KCR Serious Comments On PM Modi Govt

సమయానుకూలంగా స్పందించడంలో తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కి ఎవరూ సాటిరారు. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుని అభినందించిన కేసీఆర్ తాజాగా అనుసరిస్తున్న ధోరణిని ఎండగడుతున్నారు. కేంద్రం తప్పుడు విధానాలను అవలంభిస్తోందని ఆయన మండిపడ్డారు. కరోనా రాకకు ముందే దేశ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిందని, ఇక పులిమీద పుట్రలాగా కరోనా రావడంతో మరింతగా దెబ్బతిందని, ఆయన అన్నారు. తెలంగాణకు ప్రతి నెలా అన్నీ కలిపి రూ.15వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ఇందులో సొంత పన్నుల ఆదాయమే రూ.10,800 కోట్లు అన్నారు. వచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే ప్రతి నెలా రూ.3వేల కోట్లు కావాలన్నారు. ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోదీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించినా కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదన్నారు.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని కేసీఆర్ అంటున్నారు. దేశ ద్రవ్య నియంత్రణ వ్యవస్థను చేతిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులివ్వట్లేదని, వేరే మార్గాల్లోనైనా నిధులు సమీకరించుకునేందుకు అనుమతించట్లేదని కేసీఆర్ మండిపడుతున్నారు. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న హెలికాప్టర్‌ మనీ వంటి మార్గాల్లో డబ్బు సమీకరించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచాలని, రాష్ట్రాల అప్పుల కిస్తీలను వాయిదా వేయాలని విజ్ఞప్తిచేసినా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. ఈ పనులను ఎందుకు చేయడం లేదు?, చేస్తే మీ మీద భారం పడుతుందా? అని కేంద్రాన్ని నిలదీశారు. ఈ నెలలో కూడా అప్పులకు సంబంధించిన రూ.2,500 కోట్ల వడ్డీలను ఆర్బీఐ కట్‌ చేసుకుందన్నారు.

అయినా కొంత సమయం వేచి చూస్తామని, ఆ తర్వాత తీవ్రంగా స్పందిస్తామని కేంద్రాన్ని కేసీఆర్ హెచ్చరించారు. కేంద్రం అధికారాలను తన దగ్గర పెట్టుకుని వాడుకోవట్లేదని, చేతకాకపోతే రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు వారి నుంచి రైలు టికెట్‌ చార్జీలను కేంద్రం వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. స్పెషల్‌ రైళ్లు, రిజర్వేషన్ల పేరుతో ఈ సమయంలో కూడా దోపిడీ అవసరమా అని కేసీఆర్ నిలదీశారు. వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపేందుకు టికెట్‌ చార్జీల కింద మంగళవారం రూ.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు కట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విద్యుత్‌ చట్టం సవరణ ముసాయిదా బిల్లుపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల అధికారాలను హరించేలా ఉన్న ఈ బిల్లు ఎట్టి పరిస్థితిలో పార్లమెంట్లో పాస్ అవ్వకుండా అడ్డుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss