Tuesday, April 13, 2021

Latest Posts

ఆవేదనతో పాటూ హెచ్చరిక ధ్వనించిన జగన్ స్పీచ్

శాసనసభ ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు సీఆర్డీఏ రద్దు బిల్లులను బుధవారం నాడు శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతూ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందిస్తూ శాసనమండలిలో జరిగిన పరిణామాలు నా మనసును ఎంతగానో బాధించాయన్నారు. అసెంబ్లీ వేదికగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడటంతో పాటు అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సాగుతున్న తనను ఈ పరిణామాలు ఎంతగానో బాధపెట్టాయని అన్నారు.

చట్టాలను ఉల్లంఘించి చట్ట సభలు ఎలా వ్యవహరిస్తాయని కూడా ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. నిష్ఫక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్న చైర్మన్… తన పార్టీ అధినేత చెప్పినట్లుగా నడుచుకుని చట్ట సభలకు ఉన్న గౌరవాన్ని తీసేశారని వెరసి ప్రజలు చట్ట సభలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా రెండు రోజుల పాటు రెండు బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ రచించిన వ్యూహం చివరగా చైర్మన్ షరీప్ వ్యవహరించిన తీరు పట్ల జగన్ తనదైన శైలి నిరసనను ఈ విధంగా ప్రకటించారా అని విశ్లేషకులు అంటున్నారు. మండలి రద్దు చేసేస్తే ఏ గొడవా ఉండదన్న అభిప్రాయం కూడా ద్వనించిందన్న మాటను పలువురు ప్రస్తావిస్తున్నారు.

‘‘ కొన్ని అంశాలను సభ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకువస్తున్నా. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో మేం గెలిచాం. ఇది ప్రజల సభ ప్రజలు ఆమోదించిన సభ ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కోసం ఏర్పడ్డ సభ. చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ . మండలి అన్నది చట్టసభలో భాగం. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. మా నమ్మకంతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ శాసనమండలిలో జరిగిన తంతు అందరూ చూసారు’అని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని జారీ చేసిన ఆదేశాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్ధం అవుతుందని అన్నారు. విచక్షణా అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు’’ అని జగన్ అనడం కొసమెరుపు. మరి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss