Corona infected with CRPF jawans
అక్కడా ఇక్కడా వారు వీరు అని లేకుండా కరోనా మహమ్మారి అందరినీ తాకుతోంది. తాజాగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) విభాగంలో 9 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన జవాన్లను ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 9 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ చేశారు.
ఢిల్లీ నగరంలో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడం సంచలనం రేపింది. కాగా దేశంలో శాంతిభద్రతలను కాపాడుతూ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను సమర్థంగా ఎదుర్కొనడంలో కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సీఆర్పీఎ్ఫలో ప్రత్యక్షంగా నియామకమైన గెజిటెడ్ అధికారుల 51వ బ్యాచ్ ఇ-పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాసింగ్ అవుట్ పరేడ్‌ను వెబ్ లింక్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి మాట్లాడారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అన్జుమాన్సింగ్, దీప్లై, జితేందర్‌కుమార్ బన్సాల్‌కు అవార్డులను ప్రదానం చేశారు. సీఆర్పీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరి, అకాడమీ డైరెక్టర్ పంకజ్‌కుమార్ పాల్గొన్నారు