Corona virus Cases Surged in all countries:
మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కాలేదు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 47కు చేరింది. ఇక దేశ రాజధానిలో కేసుల సంఖ్య నాలుగుకు చేరడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం కేజ్రీవాల్‌తో సమావేశం నిర్వహించారు. కాగా మొన్న శనివారం ఇటలీ నుంచి వచ్చిన కేరళలోని కొచ్చికి చెందిన మూడేళ్ల చిన్నారికీవైరస్ సోకింది. అమెరికా నుంచి వచ్చిన బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇటలీ నుంచి వచ్చిన పంజాబ్ వ్యక్తి వైర్‌సకు గురయ్యారు. ఇరాన్ సందర్శించిన జమ్ము కశ్మీర్ వృద్ధురాలి(63)కి, పుణెలో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో మృతి చెందిన వ్యక్తి నమూనాల ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు కేంద్రం పేర్కొంది.
దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల్లో క్వారంటైన్ కోసం 5,400 పడకలు సిద్ధం చేయాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ కశ్మీర్ లోయలో పర్యటించి.. ఇరాన్‌లోని కశ్మీరీ విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడారు. వారి కోసం విమానం బయల్దేరింది. మక్కా వెళ్లిన అనంతపురం, చిత్తూరు జిల్లా ముస్లింలు ఒమన్‌లో చిక్కుకుపోయారు. జెద్దాలోని కింగ్ ఖలీద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికి.. ఇద్దరు ఇతర ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఒ మన్లో విమానాన్ని ల్యాండింగ్ చేశారు. అందరికీ వైద్యు పరీక్షలు నిర్వహించారు.
కరోనా ప్రభావంతో గల్ఫ్ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీంతో ఇక్కడ పని చేస్తున్న తెలుగు ప్రవాసీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా భారత్‌తోపాటు మరో 13 దేశాల నుంచి విమానాల రాకపోకలను ఖతర్ తాత్కాలికంగా నిషేధించింది. కువైత్ కూడా భారత్ నుంచి వచ్చే విమానాలను ఆపేసింది. కువైత్‌కు తిరిగి రాలేక అఖామా(రెసిడెన్సీ వీసా) గడువు ముగిసే ప్రవాసులకు వీసాలను రెన్యువల్ చేస్తామని కువైత్ ప్రభుత్వం ప్రకటించింది.
గల్ఫ్‌లోని అన్ని దేశాలతో సరిహద్దులు కలిగిన సౌదీ అరేబియా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, బహ్రెయిన్ నుంచి విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. సరిహద్దులను మూసేసింది. దేశంలోని పలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా షేక్ ముజిబూర్ రెహ్మాన్ శతజయంతి ఉత్సవాలకు ఈ నెల 17న బంగ్లాదేశ్ వెళ్లాల్సిన ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో ముజిబూర్ రెహ్మాన్ సంస్మరణ కార్యక్రమాలను వాయిదా వేశారు.