Corona was born in the Wuhan laboratory says Luc Montagnier
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అగ్ర రాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. లక్షల్లో పాజిటివ్ కేసులు,వేలల్లో మరణాలు గడగడలాడిస్తున్నాయి. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్ గురించి రకరకాల అనుమానాలున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చైనా తీరుపైనే కాదు,ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుని కూడా ఎండగట్టారు. అంతేకాదు, వుహాన్ ఇన్స్టీట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ ట్రైనీ పరిశోధకుడు ప్రమదవశాత్తూ దీన్ని ప్రయోగశాల బయటకు తెచ్చి ఉండొచ్చని ఓ అమెరికా టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే దీనికి బలం చేకూరుస్తూ, .. ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత లూక్ మాంటెన్యేర్ చేసిన వ్యాఖ్యలు కరోనా పుట్టుకు విషయంలో కొత్త వివాదానికి తెరలేపాయి. హెచ్ఐవీ కనుగొన్నందుకు గాను ఈయన 2008లో నోబెల్ బహుమతి అందుకున్నారు. కరోనా వైరస్ వుహాన్ ప్రయోగశాలలలోనే పుట్టిందంటూ ఓ ఫ్రెంచ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఎయిడ్స్ వ్యాధికి చికిత్స కనుగొనే ప్రయత్నాల ఫలితంగా ఈ వైరస్ పుట్టుందని తెలిపారు.
హెచ్ఐవీ జన్యుక్రమంలోని కొన్ని భాగాలు కరోనా వైరస్ జన్యుక్రమంలో కనిపించడాన్ని మాంటెన్యేర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘వుహాన్ సీటీ ప్రయోగశాల కరోనా వైరస్‌లో పరిశోధనకు ప్రఖ్యాతి గాంచింది. 2000 సంవత్సరం నుంచీ ఈ వైరస్‌పై ప్రయోగశాల అనేక రకాల పరిశోధనలు చేస్తోంది’ అని ఆయన తెలిపారు. దీంతో మరోసారి వుహాన్ ల్యాబ్ చర్చలకు కేంద్రంగా మారింది. మొత్తానికి చైనా ప్రపంచానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితులను ఈ వ్యాఖ్యలు తెస్తున్నాయి.