coronavirus has taught us self relience says narendra modi
కరోనా మహమ్మారిపై లాక్ డౌన్ కొనసాగుతున్నా సరే,పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ కొనసాగిస్తారా, సడలిస్తారా వంటి వార్తలు వస్తున్నాయి. చర్చ జరుగుతోంది. ఈనేపధ్యంలో ఈనెల 27న సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన గ్రామ సర్పంచ్ లతో శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని ఈసందర్బంగా పిలుపు నిచ్చారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడిన ప్రధాని కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించడంపై చర్చించారు.
కరోనా వైరస్ ఎన్నో పాఠాలు నేర్పిందని మోదీ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో అందరూ ఆత్మనిర్భరంతో ఉండాలన్నారు. కరోనా వేళ గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ వాసులకు పాఠాలు నేర్పారని మోదీ అన్నారు. కరోనా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ గ్రామీణులు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు. ఈ పోరాటంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, విద్యుత్, రోడ్లు, పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా సంక్షోభంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందించాలన్నారు.
కరోనా నివారణకు ఎనలేని కృషి చేస్తున్న సర్పంచ్‌లకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఎంతో కృషి చేస్తోంద న్నారు. కరోనాపై ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. పంచాయతీ వ్యవస్థ బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు ఏటా ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయితీలకు పురస్కారాలు ఇస్తామని ప్రకటించారు. ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను మోదీ ఆవిష్కరించారు.