అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. వీరి ధర్నాకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లాక్డౌన్ దృష్ట్యా రాష్ట్రంలో ధర్నా చేయకూడదని స్పష్టం చేశారు. ధర్నా చేస్తున్న వామపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బందర్‌రోడ్డు రంగా సెంటర్లో ధర్నా చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో సెక్షన్ 30, 40 అమలులో ఉందని, ముందస్తు అనుమతి లేని ఆందోళనలు, నిరసనలు నిషేధమని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… కరోనా, లాక్డౌన్ కారణంగా కష్టకాలంలో ఉన్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం అన్యాయమన్నారు. రాష్ట్రంలో మంత్రులు ఇష్టానుసారంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణ సవాల్ విసిరారు. శాంతి యుతంగా నిరసన తెలిపినా అరెస్టు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: తెలుగు బాలికకు ట్రంప్ ప్రశంసా పత్రం