Director Deva Katta Shocking Comments on Donations
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్డౌన్ అయిన నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈనేపధ్యంలో సినిమా కార్మికులను ఆదుకోడానికి చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిన్ చారిటీ మనకోసం అనే సంస్థ ఏర్పాటు చేసారు. దీంతో చాలా మంది నటులు విరాళాలు ప్రకటించారు. అగ్రనటులతో పాటు చిన్న నటులు కూడా తమకు తోచిన రీతిలో విరాళాలు ఇస్తూ,మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
ఇప్పటివరకూ రూ. 6.2 కోట్లు విరాళాలు వచ్చినట్లు చిరంజీవి స్పష్టం చేశారు. విరాళాలు ఇచ్చిన వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరూ విరాళాలు ఇవ్వాలని చిరంజీవి కోరారు. అయితే సహాయం చేసిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తూనే.. చేయనివారిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఏదోమామూలుగా కాదు, తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు దేవ కట్టా తాజాగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ, ట్వీట్ చేశారు.
`ప్రస్తుత లాక్డౌన్, ఇతర విపత్కర సమయాల్లో తమకు చేతనైనంత సహాయం చేసే ఇండస్ట్రీ మనుషుల గురించి నాకు తెలుసు. కానీ, వారు పబ్లిసిటీ కోరుకోరు. తమ సహాయాన్ని వారు వ్యక్తిగతంగానే చూస్తారు. మరికొందరు తమ సహాయం గురించి ప్రకటిస్తారు. దాని వెనుక కూడా ఓ కారణం ఉంది. తమ సహాయం మరికొందరికి స్ఫూర్తినిచ్చి వారు కూడా ముందుకొస్తారని పబ్లిసిటీ చేస్తారు. బయటకు చెప్పని వారి గురించి తప్పుగా అనుకోవడం సరికాదు. విరాళం అనేది బలవంతంగా వసూలు చేసే రౌడీ మామూలు కాదు` అని దేవ కట్టా ట్వీట్ చేశారు.