Director Shankar
ఇండియన్2’ షూటింగ్ స్పాట్లో భారీ క్రేన్ విరిగిపడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ సీబీసీఐడీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘ఇండియన్-2’ సినిమా షూటింగ్ పూందమల్లి సమీపంలోని ఈవీపీ ఫిలిమ్‌నగర్ మైదానం లో జరుపుతున్న నేపథ్యంలో.. ఈ నెల 19తేదీ రాత్రి ప్రమాదవశాత్తూ ఫోకస్ లైట్లున్న భారీ క్రేన్ తెగి కింద పడటంతో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు దుర్మరణం చెందారు. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు.
ఈ సంఘటనపై నజరత్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. షూటింగ్ స్పాట్‌కు పోలీసులు వెళ్ళి పరిశీలన జరిపినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్‌లను చూసి దిగ్ర్భాంతి చెందారు. అంతటి భారీ స్థాయిలో సెట్టింగ్‌లు నిర్మించడానికి కార్పొరేషన్, చెన్నై నగర పోలీసుల అనుమతిగాని, జిల్లా కలెక్టర్ నుంచి గానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని గుర్తించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీసీఐడీకి బదిలీ చేస్తూ గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణాధికారిగా డిప్యూటీ కమిషనర్ నాగ జ్యోతిని నియమించారు.
ఈ నేపథ్యంలో నాగజ్యోతి ఆదివారం తన విచారణను ప్రారంభించారు. ఈ నెల 24న సెట్స్ నిర్మిం చిన కార్మికులు, క్రేన్లను అద్దెకిచ్చినవారు సహా ఆరుగురిని వేర్వేరుగా విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఇండియన్-2’ సినీ దర్శకుడు శంకర్ ఎగ్మూరులో ఉన్న గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారు. తొలుత కమిషనర్ ఏకే విశ్వనాధన్ను ఆయన కలుసుకున్నారు. అనంతరం సీబీసీఐడీ పోలీసుల ఎదుట జరిగిన విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా శంకర్‌ను సీబీసీఐడీ విభాగం పోలీసు అధికారులు ప్రశ్నించారు.