సాధారణంగా నెటిజన్స్ ట్రోల్స్ వేస్తూ,ఎవరినీ ఉపేక్షించరు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో తొలిసారి పర్యటనకు వచ్చిన సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగంపై నెట్టింట్లో పెద్ద చర్చకు దారితీసింది. భారతదేశ విశిష్టతలను ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీల గురించి మాట్లాడారు. ఆపై హిందీ చిత్రసీమను పొగడ్తల్లో ముంచెత్తారు. ఏటా 2వేల బాలీవుడ్ చిత్రాలు విడుదలవుతున్నాయని, ఇది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.
బాలీవుడ్ చిత్రాలు దిల్వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్జే), షోలే వంటి చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారని చెప్పారు. ఆపై హోలీ, దీపావళి తదితర భారతీయ పండుగల గురించి ప్రస్తావించారు. భారత ఆధ్మాత్మికతలో అత్యంత పవిత్రమైన వేదాలు, ప్రపంచానికి భారతీయ సంస్కృతిని చాటిచెప్పిన స్వామి వివేకానంద ఇలా అందరినీ ప్రస్తావించి భారత్ ని పొగుడుతూ ట్రంప్ మాట్లాడారు.అయితే తన ప్రసంగాల్లో అప్పుడప్పుడూ తప్పులు పలికే ట్రంప్, మొతేరా స్టేడియంలో కూడా పలు పదాల విషయంలో తేడా కొట్టింది. ఇక్కడ ప్రసంగం సందర్భంగా ట్రంప్ నోట దొర్లిన తప్పులను కొందరు పట్టేశారు.
సచిన్ టెండూల్కర్ పేరును ‘సూచిన్ టెండుల్కర్’ అని, అలాగే బాలీవుడ్ సినిమాలను ప్రశంసించే సమయంలో ‘షోలే’ పేరును ‘షోజే’ అని పలికేశారు. మోదీ గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయన ‘చీవాలా’ నుంచి ప్రధానిగా ఎదిగారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అది ‘చీవాలా’ కాదని, ‘చాయ్‌వాలా’ అని ప్రేక్షకులు అర్థంచేసుకోవాల్సి వచ్చింది. ఇక వేదాలను ‘వేస్తాస్’ అని, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద పేరును ‘స్వామి వివేకామనన్’ అంటూ తప్పుగా పలికారు. వీటన్నింటినీ విన్న నెటిజన్లు ట్రంప్‌పై ఎటువంటి ట్రోలింగ్ చేయకుండా, తన ప్రసంగంలో ఆయన ఇన్ని విషయాలు ప్రస్తావించడమే గొప్ప గా ముక్తకంఠంతో అభినందిస్తున్నారు.