Donald trump Ridiculous Behavior at Covid-19 Briefings Baffles World
ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. ప్రపంచంలోని దేశాలన్నింటిలో అగ్రరాజ్యంగా వెలుగొందుతూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఇప్పుడు మృత్యు ఘోషతో విలవిల లాడిపోతోంది. నిజానికి ప్రపచంలోనే ఏ దేశంలో కూడా లేనంత బలమైన ఆరోగ్య వ్యవస్థ.. రక్షక వ్యవస్థ గల దేశం అమెరికా అని చెప్పాలి. శత్రుదేశాలను అమెరికా బలగాలు చీల్చి చెండాడుతాయి. శత్రుదేశాలపై సునాయాసంగా పై చేయి సాధిస్తుంది. అయితే ఇప్పుడు కంటికి కనబడని శత్రువుతో చేసే యుద్ధంలో మాత్రం ఎందుకో చతికిల పడిపోయింది. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నా, నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. లక్షలాది మంది ఆసుపత్రుల్లో మృత్యు పోరాటం చేస్తున్నారు.
అయితే అమెరికా ఈ తీవ్రతను తక్కువగా అంచనా వేసిందా? ఒకవేళ పెను విపత్తు సంభవిస్తుందని అంచనా వేయడంలో అమెరికా అధికార యంత్రాంగం విఫలమైందా? అమెరికాలో వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణం ఎవరు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స’ ఓ రిపోర్టును బయటపెట్టింది. ఇప్పటి వరకు అమెరికాలో సంభవించిన 20వేల మరణాలకు ట్రంపే బాధ్యుడని ఆ పత్రిక కుండ బద్ధలు కొట్టింది. ఇకపై సంభవించే మరణాలకు కూడా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణమని తేల్చిచెప్పింది. కరోనా వైరస్ తీవ్రత గురంచి వైట్ హౌస్ అధికార యంత్రాంగం సహా.. ఇంటెలిజెన్స్ అధికారులు, వైద్య నిపుణులు జనవరిలోనే ట్రంప్‌కు నివేదిక ఇచ్చినట్లు, అమెరికాలోకి కరోనా అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు ట్రంప్‌ను కోరినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.
అయితే అధికారుల సూచనల్ని డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం ఖాతరు చేయలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే దృష్టిసారించి, ముందస్తు చర్యలు తీసుకోలేదని అందులో ఆరోపించింది. ముందస్తు జాగ్రత్తలపై ట్రంప్ వేగంగా స్పందించకపోవడం కారణంగానే కరోనా వైరస్ అమెరికాలో వ్యాప్తి చెంది, మరణ మృదంగం మోగిస్తోందిన సదరు పత్రిక తేల్చిచెప్పింది. అధికారులు చెప్పినప్పుడే ట్రంప్ చర్యల కు దిగి ఉంటె, అమెరికాలో పరిస్థితి ఇంతదాక వచ్చేది కాదని పేర్కొంది. అందుకే ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా నమోదవ్వనన్ని కరోనా కేసులు.. మరణాలు ఒక్క అమెరికాలోనే కనిపిస్తున్నాయి.