donald Trump strong comments on WHO president
కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలోని సగానికిపైగా దేశాల్లో పూర్తిగా – పాక్షికంగా లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వైరస్ బారినపడగా – వేలాది మంది బలయ్యారు. ఇక అమెరికాలో కరోనా వైరస్ మరణమృదంగం సృష్టిస్తోంది. కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో మృత్యు ఘోష కొనసాగుతోంది. ఇక్కడ 24 గంటల్లో 731 మంది చని పోయారు.ఈ మహమ్మారిని నియంత్రించడానికి ట్రంప్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నా కరోనా వైరస్ కంట్రోల్ కావడం లేదు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. డబ్ల్యూహెచ్ ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వైరస్ వెలుగు చూసిన తొలినాళ్ల లో దాని తీవ్రత గురించి డబ్ల్యూహెచ్ ఓ వద్ద సమాచారం ఉన్నా పంచుకోవడానికి ఇష్టపడ లేదని, కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో తప్పటడుగులు వేసిందని ఆయన మండిపడ్డారు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అక్కడ పర్యటించిన విదేశీయులు తమ దేశంలోకి రాకుండా జనవరి 31న నిషేధం విధిస్తే డబ్ల్యూహెచ్ఓ వ్యతిరేకించిందని ఆయన గుర్తుచేశారు. డబ్ల్యూహెచ్ ఓ కే తామే అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నామని ట్రంప్ పేర్కొంటూ, ఆ నిధుల్ని నిలిపివేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూహెచ్ ఓ కు 58 నుంచి 122 మిలియన డాల్లర్ల మేర నిధులు కేటాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరి లో ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వెనక్కి తగ్గారు.
కాగా చైనాకు అనుకూలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనిచేస్తోందంటూ డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు నిజం కాదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కరోనా కల్లోలం ఇంకా తగ్గని కారణంగా డబ్ల్యూహెచ్ఓకు అందే నిధులకు కత్తెరేయ్యాలనే ఆలోచన కూడా సరికాదని అభ్రిప్రాయపడింది. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 400 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చింది. చైనా సమకూర్చిన మొత్తం కంటే ఇది రెండు రెట్లకుపైనే కావడం విశేషం. కరోనా వైరస్‌పై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో కలిసి పనిచేయడమనేది ఎంతో అవసరమని సంస్థ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఎలివార్డ్ స్పష్టం చేశారు.