Don’t believe rumors on coronavirus(COVID-19) says mahesh babu
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో ప్రజల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పేదలకు ఆర్థికంగాను సామాజికంగాను సహాయం చేయడానికి సిద్దమయ్యారు. ప్రతీ రోజు ప్రజలను అభిమానుల్లో ధైర్యాన్ని నింపుతూ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షల చొప్పున రూ.1 కోటి తో పాటు సినీ రోజువారీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ. 25 లక్షల విరాళం అందించాడు. కొద్దిరోజులుగా ప్రజలను ఈ మహమ్మారి పట్ల జాగ్రత్త వహించాలని కోరుతూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పలు పోస్టులు కూడా పెట్టాడు. వాటి ద్వారా తనకు సాధ్యమైనంత వరకు అవర్నెస్ కలిగిస్తూ వస్తున్నాడు.
తాజాగా రెండు వారాల లాక్డౌన్ తర్వాత మహేష్ బాబు స్పందిస్తూ, ప్రజలకు వైద్యులకు పోలీసుల సేవలను ప్రశంసిస్తూ ట్వీట్ చేసాడు. ‘వరల్డ్ హెల్త్ డే’ సందర్భంగా ‘రెండు వారాల లాక్డౌన్ కాలంలో మనమంతా మానసికంగా చాలా బలంగా కనిపించాం. మన ప్రభుత్వాలు సమిష్టిగా తీసుకొన్న చర్యలు అభినందనీయం. కరోనాపై పోరాటాన్ని చూస్తూ మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకొని ఈ వరల్డ్ హెల్త్ డే జీవితంలో మరిచిపోలేని విధంగా మలచుకొందాం’ అని పోస్ట్ చేసారు. కరోనా వైరస్ ని తరిమి కొట్టడానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం పరిశుభ్రత ఆరోగ్య సూత్రాలను పాటించడమే కాకుండా మనం మరిన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెల్పాడు. అనవసరపు వార్తలు ఫేక్ న్యూస్‌కు భయపడకుండా ఫియర్ డిస్టెన్స్‌ను కూడా అలవాటు చేసుకోవాలని మహేష్ సూచించాడు.
‘కరోనా వైరస్ పోరాటానికి రోడ్లపై డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు ఇతర అధికారులు అలాగే తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి వైద్య చేస్తున్న డాక్టర్లకు మనం చేతులెత్తి మొక్కాలి. వారి సేవలను ఘనంగా కీర్తించాలి. వారందరినీ భగవంతుడు చల్లగా చూడాలి. కరోనా ఓ వైపు విజృంభిస్తుంటే.. మరో పక్క అంతకంటే దారుణంగా ఫేక్ న్యూస్ విలయతాండవం చేస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలి. వాటిని నమ్మకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మానవత్వం ప్రేమ సానుకూలతను ప్రజల్లో పెంచాలి. తప్పకుండా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడం ఖాయం. మీరంతా ఇంటి పట్టునే క్షేమంగా ఉండండి’ అంటూ సూపర్ స్టార్ ట్వీట్ చేశారు.