ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు(58) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో ఆమె తలకు గాయమైంది.అప్పటినుంచి ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో ఆమెకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా అక్కడి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. కూచిపూడి నాట్య కళాకారిణిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శోభానయుడు.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన ఆమె.. చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు చేయడం ప్రారంభించారు. నాట్య ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలెన్నో గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. శోభానాయుడుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆమె మరణ వార్తతో వారంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. శోభానాయుడు మృతికి అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.వి.సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: