Exciting on the Prime Minister’s announcement on the lockdown
కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి మార్చి 25న ప్రకటించిన లాక్ డౌన్ ఈనెల 14తో ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తారా .. కొనసాగాగిస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్డౌన్పై కీలక ప్రకటన చేయనున్నట్లు టాక్. ఆ రోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ లాక్డౌన్ పొడగించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అభిప్రాయాలూ తెలుసుకున్నాక మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం లాక్డౌన్ పొడగింపు కోసమే మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని పార్టీల ఫ్లోర్లీడర్లతో సమావేశం సందర్భంగా మోదీ మాట్లాడతూ…. ఒకేసారి లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి లేదని నిర్మొహమాటంగా తేల్చేసారు. దేశంలోని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దేశంలో పరిస్థితి చూస్తుంటే ‘సామాజిక అత్యవసర పరిస్థితి’ తో సమానంగా ఉందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు,కరోనాకు ముందు,కరోనాకు తర్వాత అనే పరిస్థితి వస్తుందని అంటున్నారు.
అయితే అనేక మార్పులతో లాక్డౌన్ కొనసాగిస్తారని కూడా వినిపిస్తోంది. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధిస్తారని, అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం ఇందుకు మినహాయింపు ఇవ్వనున్నారని సీనియర్ అధికారుల ద్వారా వెల్లడవుతోంది.
అయితే విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను మూసే ఉంచుతారని గట్టిగానే వినిపిస్తోంది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్న కారణంగా, కొన్ని రంగాలకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తారని అంటున్నారు. అయితే అక్కడ సామాజిక దూరం కచ్చితంగా పాటించాలన్న కఠిన నిబంధనలను విధిస్తారట. అత్యంతగా నష్టపోయిన రంగాల్లో విమాన రంగం ప్రథమ వరుసలో ఉంది. దీంతో విమానాల రాకపోకలను క్రమంగా ప్రారంభించవచ్చని అయితే, అన్ని తరగతులలో మధ్య సీటు ఖాళీగా ఉంచాలన్న నిబంధనను తెరపైకి తేనున్నట్లు సమాచారం.