FASTagను ఇంకా కొనుగోలు చేయలేదా? అయితే మీకో గుడ్న్యూస్! జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం FASTagను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉచితంగా పొందవచ్చు. ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ పదిహేను రోజుల పాటు కల్పిస్తోంది. ఎలక్ట్రానిక్ టోల్ విధానాన్ని మెరుగుపరచడం కోసం FASTagలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
రూ.100 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ మేరకు హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వీటిని NHAIలకు చెందిన టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వద్ద ఉచితంగా పొందవచ్చు. వాహనదారులు పై ప్రాంతాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా FASTagలను తీసుకోవచ్చునని ప్రకటించింది. రూ.100 ఛార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.
వాహన వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రే,న్ సర్టిఫికెట్ (RC)ని NHAI టోల్ ఫ్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్ ఆఫ్ సేల్ వద్ద చూపించి FASTagను పొందవచ్చు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కేంద్రం జనవరి 15, 2020 నుండి ఫాస్టాగ్ విధానాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్ వల్ల ప్రయాణీకులు టోల్ ప్లాజా వద్ద వేచి చూసే ఇబ్బందులు తప్పుతాయి. ఇంధన వాడకం తద్వారా కాలుష్యం తగ్గుతుంది.