ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్‌కూ వచ్చేసింది. హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సికింద్రాబాద్‌లోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో జంట నగరాలు భయం గుప్పిట్లో చేరిపోయాయి. ఇక మహేంద్రా హిల్స్ పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సంబంధించి కొన్ని భయంకర నిజాలు వెలుగులోకి రావడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మహేంద్ర హిల్స్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్.. కరోనా వైరస్ బారిన పడ్డారు. బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆయన.. ఇటీవలే దుబాయ్ వెళ్లొచ్చారు. అక్కడ హాంకాంగ్‌కు చెందినవారితో కలిసి పనిచేశారు. ఫిబ్రవరి 20న బెంగళూరుకు తిరిగొచ్చారు. అక్కడి నుంచి బస్సులో ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చాక.. వైరస్ సోకిన లక్షణాలు కనపడడంతో తొలుత సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఔట్ పేషెంట్‌గా చికిత్స తీసుకున్నారు.
ఈ క్రమంలో ఆయన సికింద్రాబాద్‌లో పలు ప్రాంతాల్లో తిరిగినట్టు సమాచారం. జ్వరం తగ్గకపోవడంతో ఫిబ్రవరి 27న ఆ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో.. ఆ ఆస్పత్రిలోని వైద్యులకు అనుమానం వచ్చి ఆయన్ను గాంధీ ఆస్పత్రికి పంపారు. మార్చి 1న గాంధీలో చేరిన ఆయన రక్త నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కేంద్రం సోమవారం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది.