G. V. L. Narasimha Rao comments on Vizag Airport Issue:
జివిఎల్ నోట మళ్ళీ అదే మాట
కీలక వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తరచూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన పరిణామాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటివి చోటుచేసుకోవడానికి చంద్రబాబే కారణమంటూ ఆయన చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
నిన్నటి ఘటన కంటే.. గతంలో టీడీపీ దారుణంగా వ్యవహరించిందని కూడా జివిఎల్ ఆరోపించారు. రాష్ట్రాన్ని వైసీపీ, టీడీపీ భ్రష్టు పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబుపై కోడిగుడ్లు వేయడం మంచి సంస్కృతి మాత్రం కాదని ఆయన స్పష్టం చేసారు. ఇక టీడీపీ హయాంలో ఏపీలోకి కేంద్రం రావొద్దన్నది చంద్రబాబు కాదా?, రాజధానిలో రైతుల సమస్యలను పరిష్కరించకుండా స్థలాలు ఎలా పంచుతారు? అని ఆయన నిలదీసారు.
కాగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలుస్తామని జివిఎల్ ప్రకటించారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉందని మరోసారి ఆయన తేల్చిచెప్పారు. రాజధానిపై కేంద్రం వైఖరినే చెబుతున్నానని ఆయన పేర్కొంటూ, ప్రజలను మభ్యపెట్టడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు.