తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు శుభవార్త తెలిపింది. చెప్పినటుగానే కష్టించి పని చేసే రైతన్నల రుణాలను మాఫీ చేయానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రెండు రోజుల క్రితం సీ.ఎం కేసీఆర్ ఎవరెవరికి రూ.25 వేలలోపు ఉన్న రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని తెలిపారు. సి.ఎమ్ చెప్పినట్టుగానే రైతులకు పంటవేసే సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు వాటిని మాఫీ చేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలుఈ రోజు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆద్వర్యంలో రైతు రుణమాఫీ, పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు నిధుల విషయల గురించి చర్చించి రూ.25 వేలు నుంచి రూ.లక్ష లోపు ఉన్న రుణాలకు నాలుగు విడతలుగా చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం రూ.1200 కోట్లు విడుదల చేసి రూ. 25 వేల లోపు రైతు రుణాలను ఒకే సారి మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 6లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం మొదలవుతున్న తరుణమలో రైతులు పంటలను సాగు చెయ్యడానికి వారి చేతుల్లో పెట్టుబడికి డబ్బులు ఉండాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అందువల్ల రాబోయే వానాకాల పంటకు రైతుబంధు పథకం కోసం రూ.7 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కేబినెట్లో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ. 7 వేల కోట్లను పంట సీజన్ ప్రారంభం నాటికే రైతులకు అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.