దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారి మరింత బలోపేతం అయ్యింది. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు అధికారులు. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది నేడు వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుండగా, దీనికి వాతావరణ శాఖ ‘యాంపిన్’ అని పేరు పెట్టారు.
రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయానికి తుఫాన్ గా రూపాంతరం చెందే యాంపిన్, ఆపై తొలుత వాయువ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, దీనికి యాంపిన్ తోడు కానుందని 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. 17వ తేదీన తీరం వెంబడి 80 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 18న గాలుల తీవ్రత అధికమవుతుందని హెచ్చరించారు. కాగా, నేడు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఏ.పీ నోటిఫికేషన్ను సస్పెండ్ చేసిన హైకోర్టు